Hyderabad: నకిలీ వైద్యుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఆ వ్యక్తి డాక్టర్ కావాలనుకున్నాడు.. కానీ చదువు అబ్బలేదు. దీంతో చదువును పక్కన పెట్టి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ నేర్చుకున్నాడు.

By అంజి  Published on  10 Sept 2024 3:45 PM IST
Hyderabad, SOT Police, arrest, fake doctor, Uppal

Hyderabad: నకిలీ వైద్యుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఆ వ్యక్తి డాక్టర్ కావాలనుకున్నాడు.. కానీ చదువు అబ్బలేదు. దీంతో చదువును పక్కన పెట్టి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ నేర్చుకున్నాడు.. అయినా కూడా తన కోరిక చంపుకోలేక ఏకంగా వైద్యుడిగా అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. తాజాగా అతడి గుట్టు రట్టైంది. ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖ నుండి అనుమతి పొంది ఎటువంటి అర్హతలు లేకున్నా కూడా ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న నకిలీ వైద్యుడి గురించి సమాచారం రావడంతో వెంటనే ఎస్ఓటి బృందం అతన్ని అరెస్టు చేసి ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

పీర్జాదిగూడ బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న చౌటుప్పల్ లింగోజిగూడెం గ్రామానికి చెందిన కొయ్యలగూడెం బిక్షపతి అనే వ్యక్తి.. ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్లో ఒక ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబిబిఎస్ డాక్టర్ పేరుతో పర్మిషన్ తీసుకొని మణికంఠ పాలీ క్లినిక్ ను గత ఐదు సంవత్సరాలుగా నడుపుతున్నాడు. తనకున్న మిడిమిడి జ్ఞానంతో అమాయకమైన జనాలకు వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడాడు.

కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న బిక్షపతి వైద్యుడిగా వైద్య పరీక్షలు చేస్తూ, ప్రిస్క్రిప్షన్ రాస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న అమాయకపు జనాన్ని మోసం చేస్తూ డాక్టర్ గా పేరు సంపాదించాడు. అమాయకమైన జనాన్ని మోసం చేస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్సై మల్లేష్ తన సిబ్బందితో కలిసి ఆ క్లినిక్ పై ఆకస్మికంగా తనిఖీలు చేసి నకిలీ వైద్యుడు బిక్షపతిని అదుపులోకి తీసుకొని... తదుపరి విచారణ నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఉప్పల్ పోలీసులు నకిలీ వైద్యుడు బిక్షపతిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story