హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో కాల్పులు జరిపిన కేసులు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో కాల్పులు జరిపిన ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి మూడు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరానా నిందితుడు బీహార్‌లోని ఓ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
అయితే నిన్న పరారీలో ఉన్న నిందితుడు ప్రభాకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రిజమ్ పబ్ వద్దకు చేరుకున్నారు. అది గమనించిన ప్రభాకర్ తన దగ్గర ఉన్న తుపాకీతో ఆ పబ్‌లోనే పోలీసులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాగా నిందితుడు ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుళ్లు, బౌన్సర్లు గాయపడ్డారు. ఇప్పటికే నిందితుడి నుంచి 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బిహార్ నుంచి కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకూ చోరీ కేసులు ఉన్నాయి.
చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పాత నేరస్థుడు. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో తప్పించుకుపోయాడు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. ఇటీవల సైబరాబాద్ పరిధి మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనాలు చేశాడు. నిందితుడు ఎక్కువగా ఇంజినీరింగ్ కళాశాలల్లో చోరీ చేస్తుంటాడు. ప్రవేశాలు, పరీక్షలు, హాస్టల్ ఫీజు డబ్బులు కళాశాలల్లో ఉంటాయని పక్కా పథకంతో చోరీ చేస్తాడు.