Hyderabad: అమీన్‌పూర్ పరువు హత్య కేసు.. రిమాండ్‌లో నిందితులు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీఐ
అమీన్‌పూర్ పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రవణ్ సాయి (20) అనే యువకుడు..
By - అంజి |
Hyderabad: అమీన్‌పూర్ పరువు హత్య కేసు.. రిమాండ్‌లో నిందితులు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీఐ
హైదరాబాద్: అమీన్‌పూర్ పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రవణ్ సాయి (20) అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన యువతి(19) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రవణ్‌నే పెళ్లి చేసుకుంటానని కూతురు పట్టుబట్టడంతో.. పథకం ప్రకారం కుటుంబ సభ్యులు శ్రవణ్‌ను ఇంటికి రప్పించి.. బ్యాటుతో దారుణంగా కొట్టి ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ నెల 9 న బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి ని ఇంటికి పిలిపించి యువతి తల్లి సిరి మర్డర్ చేసింది. సిరి కూతురు శ్రీజ, శ్రవణ్ సాయి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ఈ నెల 9న శ్రవన్ సాయిని ఇంటికి పిలిపించి బ్యాట్ తో కొట్టింది తల్లి సిరి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రవణ్‌సాయి మరణించాడు. ఈ ఘటనపై శ్రవణ్‌సాయి పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ హత్య కేసులో సిరితో పాటు భర్త హరిబాబు, కొడుకు రాము నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. భర్త హరిబాబు, కొడుకు రామును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అమీన్‌పూర్ సీఐ నరేష్ సమగ్ర విచారణ చేపట్టారు. ఆ తదనంతరం శనివారం మధ్యాహ్నం సిరిని అమీన్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి శనివారం రాత్రి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ కు తరలించే ముందు ముగ్గురికి పటాన్ చెరు ఏరియా ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
అమీన్‌పూర్ సీఐ మాట్లాడుతూ.. 'శ్రవణ్ సాయి తన క్లాస్ మేట్ అయిన అమ్మాయి శ్రీజతో లవ్ ఎఫైర్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు పలుమార్లు కలిశారు. శ్రీజకు మూడో నెల ప్రెగ్నెన్సీ నిర్దారణ కావడంతో ఆమె తల్లి సిరి.. శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచింది. ఆ తర్వాత జరిగిన వాగ్వాదంలో కోపంతో ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో శ్రవణ్‌సాయిని శ్రీజ తల్లి సిరి గాయపర్చింది. అడ్డుకున్న శ్రీజకు కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడ సిరి భర్త, ఆమె కుమారుడు ఉన్నారు.'