హైదరాబాద్‌లో విషాదం.. నవ వధువు ఆత్మహత్య

ప్రతి నిత్యం గొడవలు జరుగుతూ ఉండడంతో తీవ్ర మన స్థాపానికి గురైన ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్‌ పరిధిలో జరిగింది.

By అంజి  Published on  4 March 2025 12:21 PM IST
Hyderabad, Newlywed ,suicide , Rayadurgam police station, Crime

హైదరాబాద్‌లో విషాదం.. నవ వధువు ఆత్మహత్య

ఓ యువతి బాగా చదువుకుంది. మంచి ఉద్యోగం చేస్తోంది... అలాగే ఓ యువకుడు కూడా పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వారి సంసారం సాఫీగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నారు. కానీ వివాహమైన దగ్గర నుండి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతి నిత్యం గొడవలు జరుగుతూ ఉండడంతో తీవ్ర మన స్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా లోని తోర్ మామిడి కమలాపురం ప్రాంతానికి చెందిన దేవిక (25) అనే యువతి పూణేలో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తోంది. మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీష్ చంద్ర.. ఖరగ్ఫూర్ లో ఐఐటి ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఒకే సంస్థలో పనిచేయడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువైపులా కుటుంబ సభ్యులను ఒప్పించి గత ఏడాది ఆగస్టు 23వ తేదీన గోవాలో వైభవంగా వివాహం చేసుకున్నారు.

వివాహం జరిగిన అనంతరం దంపతులు రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్లో కాపురం పెట్టారు... ప్రేమ వివాహం కాబట్టి వారి సంసారం సాఫీగా సాగుతుందని ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ అది జరగలేదు. వివాహమైన కొన్ని రోజుల నుండే దంపతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఈ మధ్య కాలంలో ఇద్దరు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కూడా దేవిక , సతీష్ చంద్ర మధ్య పెద్ద ఎత్తున గొడవ చెలరేగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దేవిక తన గదిలోకి వెళ్లి లోపలి నుండి గడియ పెట్టుకుంది. సతీష్ చంద్ర కూడా ఆవేశంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చి చూడగా అప్పటికి దేవిక గది తలుపులు పెట్టి ఉండడంతో తలుపు తట్టాడు... అయినా కూడా లోపల నుండి ఎటువంటి శబ్దం రాకపోవడంతో తాను నిద్రపోయి ఉంటుందని భావించి సతీష్ చంద్ర తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు.

ఉదయం పనిమనిషి వచ్చి తలుపు తట్టినా కూడా దేవిక తలుపులు తీయలేదు. మరోవైపు దేవిక ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా అప్పటికి కూడా తలుపులు తీయక పోవడంతో సతీష్ చంద్రకు అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా... ఫ్యాన్ కు వేలాడుతూ దేవిక కనిపించింది.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అయితే దేవిక సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తన అల్లుడు సతీష్ చంద్ర కట్నం కోసం తరచూ తన కూతుర్ని వేధింపులకు గురి చేయడం వల్లనే తన కూతురు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రామలక్ష్మి పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story