Hyderabad: అమ్మాయి విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచిన స్నేహితులు
బాలాపూర్‌లో ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో జరిగిన గొడవలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు కత్తితో పొడిచారు.
By - అంజి |
Hyderabad: అమ్మాయి విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచిన స్నేహితులు
హైదరాబాద్: ఆదివారం రాత్రి బాలాపూర్‌లో ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో జరిగిన గొడవలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు కత్తితో పొడిచారు. ఫలక్‌నుమాలోని వట్టేపల్లి నివాసి అయిన రెహాన్‌గా గుర్తించబడిన బాధిత వ్యక్తి తన ఇద్దరు స్నేహితులు షానవాజ్, మోయిజ్‌లతో కలిసి బాలాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్ళాడు. హైదరాబాద్‌లోని షాహీన్‌నగర్‌లోని ఫంక్షన్ హాల్‌లో.. రెహాన్, అతని స్నేహితుల మధ్య ఒక అమ్మాయికి సంబంధించిన విషయంపై వాగ్వాదం జరిగింది. వాదన సమయంలో, షానవాజ్, మోయిజ్‌లు.. రెహాన్ కడుపు, ఛాతీపై కత్తితో పొడిచారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే రెహాన్‌ను చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాలాపూర్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
బాలాపూర్, చాంద్రాయణగుట్ట, పహడి షరీఫ్ లో వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు అర్థరాత్రి సమయంలో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో ఆవారాగా తిరుగుతున్న పోకిరిల భరతం పడుతున్నారు. కారణం లేకుండా రోడ్లమీద కనిపించిన పోకిరిలను ఇళ్లకు తరుముతున్నారు. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అల్లరి చిల్లరగా తిరిగే పోకిరిలకు బుద్ధి చెబుతున్నారు. మొదటిసారి పోలీసుల చేతికి చిక్కితే కేవలం దెబ్బలు మాత్రమే తింటారు కానీ రెండవసారి పోలీసులకు చిక్కితే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.