హైదరాబాద్: సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖలందర్ నగర్ కు చెందిన 22 ఏళ్ల యువకుడు తన ప్రియురాలి తండ్రి వేధింపులు భరించలేక ఉరి వేసుకుని మరణించాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. సంతోష్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ ఇమ్రాన్ చంద్రాయణగుట్టకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. మూడు రోజుల క్రితం ఆ అమ్మాయి తండ్రి అబిద్ అలీ, ఈ సంబంధం గురించి తెలుసుకుని, ఇమ్రాన్ ఇంటికి వెళ్లి, కొన్ని రోజుల తర్వాత పెళ్లి గురించి చర్చిస్తామని హామీ ఇచ్చాడని తెలుస్తోంది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం నాడు, ఆ అమ్మాయి తండ్రి.. ఇమ్రాన్ తన కూతురిని వేధిస్తున్నాడని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇమ్రాన్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ తప్పును పునరావృతం చేయవద్దని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నాడు. తన సూసైడ్ నోట్‌లో, అమ్మాయి తండ్రిపై చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ పోలీసులను కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్న సంతోష్ నగర్ పోలీసులు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.