హైదరాబాద్: 2020లో చైతన్యపురిలో మైనర్ బాలికపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తికి స్థానిక కోర్టు శుక్రవారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు రూ.15,000 జరిమానా కూడా విధించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కె. దినేష్ అలియాస్ చిన్న (29) ఉద్యోగం వెతుక్కుంటూ నగరానికి వచ్చి ప్రేమ పేరుతో బాలికను ఆకర్షించి, ఆమెను కిడ్నాప్ చేసి వివాహం చేసుకుని, నిర్బంధంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దినేష్‌ను అరెస్టు చేశారు. బాధితురాలికి కోర్టు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
మరో అత్యాచారం కేసు..
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి సంగారెడ్డి స్పెషల్ పోక్స్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.10 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి స్పెషల్ పోక్స్ కోర్టు జడ్జి కే జయంతి తీర్పు ఇచ్చారు. ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గత 8 ఏళ్ల కిందట జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం బొల్లారంలోని లక్ష్మీ నగర్ కాలనీలో భూస్వామి కృష్ణారావు ఇంట్లో నివాసం ఉంది. ఈ క్రమంలోనే 2019 మే 3వ తేదీ నాడు రాత్రి కృష్ణారావు కుమారుడు దుర్గాప్రసాద్ తన ఇంటి బిల్డింగ్ పైకి బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు తల్లిదండ్రులు బొల్లారం పీఎస్‌లో అత్యాచారానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసులో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.