హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ అరెస్ట్..అక్రమంగా రూ.100 కోట్ల సంపాదన

హైదరాబాద్‌లో ఓ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతను అక్రమంగా రూ.100 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.

By Srikanth Gundamalla  Published on  26 Oct 2023 4:00 PM GMT
hyderabad, gangster, khizar, arrest, crime,

హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ అరెస్ట్..అక్రమంగా రూ.100 కోట్ల సంపాదన

ఓ వ్యక్తి డబ్బులు కోసం ఒకరిని హత్య చేశాడు. హత్య కేసులో జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఒక గ్యాంగ్ ను ఏర్పరచుకొని గ్యాంగ్‌స్టర్ అయ్యాడు. ఈ విధంగా సుపారి, కబ్జాలు, సెటిల్మెంట్‌లు చేస్తూ ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పటివరకు చిక్కకుండా తప్పించుకొని తిరిగాడు. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో హబీబ్‌నగర్ పోలీసులు సౌత్ వెస్ట్ జోన్ పోలీసులతో కలిసి ఆ రౌడీ షీటర్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రౌడీ షీటర్ మహమ్మద్ ఖైజర్ అలియాస్‌ ఖైజర్ అలియాస్ చోర్ ఖైజర్ అలియాస్ మల్లెపల్లి ఖైజర్ (54) అని రౌడీ షీటర్ రకరకాల పేర్లతో గ్యాంగ్‌స్టర్‌గా చలామణి అవుతున్నాడు. అయితే ఈ గ్యాంగ్ స్టర్ ఖైజర్ ను గుడిమల్కాపూర్ నివాసి అయిన వానరాసి యాదగిరి అనే వ్యక్తి కలిశాడు. తన అన్న రాజు హత్య కేసులో ప్రమేయం ఉన్న తన ప్రత్యర్థులను అంతమొందించాలని యాదగిరి చెప్పాడు. అందుకు ఖైజర్ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు యాదగిరి ఒప్పుకొని రెండు లక్షల రూపాయలు ఖైజర్ కు ఇచ్చాడు. యాదగిరి చెప్పిన ప్రత్యర్థులను చంపడంలో ఖైజర్ విఫలం చెందాడు.

అంతేకాకుండా ఖైజర్ ప్రత్యర్థులను చంపకుండా సాకులు చెప్తూ వచ్చాడు. దాంతో తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ యాదగిరి ఖైజర్ ను అడిగాడు. మరో రెండు లక్షలు ఇవ్వాలంటూ సుపారీ ఇచ్చిన యాదగిరిని వేధింపులకు గురి చేశాడు గ్యాంగ్‌స్టర్ ఖైజర్. రౌడీ షీటర్ బెదిరింపులు భరించలేక యాదగిరి లక్షన్నర రూపాయలు చెల్లించాడు. అనంతరం ఇంకా డబ్బులు కావాలంటూ బెదిరింపులకు గురి చేస్తూ వచ్చాడు ఖైజర్. దాంతో.. వేగలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఖైజర్ చరిత్ర మొత్తం కూపీ లాగారు. అతడి హిస్టరీ వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.

ఖైజర్ అమాయకులను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా హత్యకు సుపారీ తీసుకోవడం, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు తదితర మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతను 1995లో తన వ్యక్తిగత పగతో తన స్నేహితుడు అకీల్ తో కలిసి నాంపల్లి వద్ద అఫ్జల్ అనే వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి.... తిరిగి జైలు నుండి విడుదలైన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి అమాయకమైన జనాలను కత్తితో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ వచ్చాడు. భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు. ఇతనిపై 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇతను వివిధ రకాల మోసాలకు పాల్పడుతూ ఇప్పటి వరకు రూ.100 కోట్లు సంపాదించాడని పోలీసులు తెలిపారు. గతంలో ఖైజర్‌పై పీడియాక్ట్ కూడా నమోదు చేయడం జరిగిందనీ పోలీసులు చెప్పారు. చివరకు రౌడీ షీటర్ మహ్మద్ ఖైజర్ ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story