Video: హైదరాబాద్‌లో బీభత్సం.. కానిస్టేబుల్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లి..
మద్యం మత్తు, మితిమీరిన వేగం ఒక యువకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయి. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి స్వదేశానికి వచ్చిన...
By - అంజి |
Video: హైదరాబాద్‌లో బీభత్సం.. కానిస్టేబుల్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లి..
హైదరాబాద్: మద్యం మత్తు, మితిమీరిన వేగం ఒక యువకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయి. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి స్వదేశానికి వచ్చిన ఓ యువకుడు, తన పుట్టినరోజు నాడే మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించి జైలు పాలయ్యాడు. నార్సింగిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే గుర్రంపాటి తరుణ్ (24), శనివారం తన పుట్టినరోజు కావడంతో శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి భారీగా మద్యం సేవించాడు. శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో పూర్తి మత్తులో ఉన్న తరుణ్, తన బెంజ్ కారులో కూకట్‌పల్లికి బయలుదేరాడు.
నానక్‌రాంగూడ వద్ద తొలుత ఒక కారును, ఆ తర్వాత ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తరుణ్, ఆగకుండా గచ్చిబౌలి వైపు వేగంగా దూసుకెళ్లాడు. బాధితుల సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కారును ఆపే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు కారుకు అడ్డుగా వెళ్లగా, తరుణ్ కారు వేగం పెంచి ఆయనను ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ కారు బానెట్‌పై పడిపోయారు. కానిస్టేబుల్ బానెట్‌పై ఉన్నాడని తెలిసినా, తరుణ్ కనికరం లేకుండా దాదాపు 800 మీటర్ల దూరం గోపీచంద్ అకాడమీ వరకు కారును నడిపాడు.
చివరకు ఇతర వాహనదారులు కారుకు అడ్డంగా వాహనాలు నిలపడంతో తరుణ్ కారు ఆపాల్సి వచ్చింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో తరుణ్ రక్తంలో ఆల్కహాల్ శాతం 160 mg గా నమోదైంది (సాధారణ పరిమితి 30 mg). తండ్రి లేని తరుణ్‌ను అతని తల్లి (వైద్యురాలు) ఎంతో కష్టపడి అమెరికా పంపి చదివించారు. కానీ, ఒక్క రోజు బాధ్యతారాహిత్యం అతడిని నిందితుడిగా మార్చింది. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో, ఆదివారం అతడిని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు.
#Hyderabad--హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బెంజ్ కారుతో బీభత్సం సృష్టించిన యువకుడు జైలు పాలయ్యాడు. మద్యం మత్తులో కానిస్టేబుల్‌ను కారు బానెట్‌పై 800 మీటర్లు ఈడ్చుకెళ్లిన నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. pic.twitter.com/D6MjrfJoUj
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 2, 2026