Hyderabad: ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థి.. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో

మేడిపల్లిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న ఓ యువకుడు పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి
Published on : 22 Jan 2024 9:50 AM IST

Hyderabad, student,  exam fear, Crime news

Hyderabad: ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థి.. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో

హైదరాబాద్‌ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మేడిపల్లిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న ఓ యువకుడు పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడలో నివాసముంటున్న బాలుడు కె.నితేష్ (15) తన కుటుంబంతో సహా ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు బాలుడు. పరీక్షల్లో రాణించలేడనే భయంతో నితీష్‌ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లిలో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరామ్‌ అభిలాష్‌(15) రుక్మాపూర్‌ సైనిక్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవుల అనంతరం స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు.

Next Story