Video: ప్రాణం తీసిన ముగ్గు గొడవ

వాకిట్లో వేసిన ముగ్గు వల్ల జరిగిన గొడవలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  6 July 2023 11:36 AM IST
Hyderabad, Clash over Rangoli, Crimenews

Video: ప్రాణం తీసిన ముగ్గు గొడవ

ఇంటి ముందు వేసిన ముగ్గు చిచ్చు రేపింది. వాకిట్లో వేసిన ముగ్గు వల్ల జరిగిన గొడవలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఛత్రినాక పీఎస్‌ పరిధిలోని శివాజీనగర్‌ ఏరియాలో రెండు కుటుంబాలు ఎదురెదురుగా నివాసం ఉంటున్నాయి. మాణిక్ ప్రభు (36) అనే వ్యక్తి తల్లి తమ ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్లింది. ఆ కాసేపటికే ఎదరింట్లో నివాసం ఉండే దుర్గేష్ కుటుంబసభ్యులు వాకిలి కడగడంతో ఆ ముగ్గు కాస్తా కొట్టుకుపోయింది. దీంతో మాణిక్ ప్రభు తల్లి.. ఎదురింటి వారిని నిలదీసింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది.

ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మాణిక్ ప్రభు మర్మాంగంపై గాయం కావడంతో అతడు అక్కడిక్కడే కుప్పకూలాడు. అతడిని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ ఎదురింట్లో నివాసం ఉండే దుర్గేష్, ఆంజనేయులు ఇద్దరూ కలిసి తమ కొడుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని మాణిక్‌ ప్రభు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇరు కుటుంబాల మధ్య ఇంతకుముందు కూడా గొడవలు జరిగాయని పోలీసులు చెప్పారు. ప్లంబర్‌గా పనిచేస్తున్న మాణిక్ ప్రభు.. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. అతడి మృతితో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story