Hyderabad: మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మైలార్ దేవ్ పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
By - అంజి |
Hyderabad: మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: మైలార్ దేవ్ పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మైలార్ దేవ్ పల్లి పరిధిలోని దుర్గానగర్‌లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారు మితిమీరిన వేగంతో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి అత్యంత వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న దుప్పట్లు, రగ్గులు అమ్ముకునే దుకాణం లో నిద్రిస్తున్న తండ్రి, కుమారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దీపక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి ప్రభు మహారాజ్, సోదరుడు సత్తునాథ్ కు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రభు మహారాజ్ జీవనోపాధి నిమిత్తం ఉత్తర ప్రదేశ్ నుంచి వలస వచ్చి హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు అమ్ముకుంటు జీవితం గడుపుతున్నాడు.
ఇన్నోవా కారు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ నుండి సంతోష్ నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే కారులో మొత్తం ఆరుగురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆరుగురిలో ముగ్గురు పరారు కాగ.. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.