Hyderabad: బీబీ నగర్‌ చెరువులో వైద్య విద్యార్థి మృతదేహం లభ్యం

ఎయిమ్స్ బీబీనగర్‌లో నాల్గవ సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థి మృతదేహాన్ని గురువారం ఉదయం ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని సరస్సు నుండి బయటకు తీశారు.

By అంజి
Published on : 16 May 2025 11:27 AM IST

Hyderabad: బీబీ నగర్‌ చెరువులో వైద్య విద్యార్థి మృతదేహం లభ్యం

హైదరాబాద్: ఎయిమ్స్ బీబీనగర్‌లో నాల్గవ సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థి మృతదేహాన్ని గురువారం ఉదయం ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని సరస్సు నుండి బయటకు తీశారు. అభిజీత్ జె గా గుర్తించబడిన అతను కేరళకు చెందినవాడు. పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు, అయితే కారణం అస్పష్టంగా ఉంది.

కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన అభిజీత్ చివరిసారిగా బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై క్యాంపస్ హాస్టల్ నుండి బయలుదేరాడు. అతను తిరిగి రాకపోవడంతో, స్నేహితుల నుండి వచ్చిన కాల్స్‌కు స్పందించకపోవడంతో, హాస్టల్ అధికారులు కళాశాల యాజమాన్యం.. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.

వెంటనే పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆ రాత్రి తరువాత, పోలీసులు అభిజీత్ స్కూటర్, పాదరక్షలు, మొబైల్ ఫోన్‌ను ఎయిమ్స్ క్యాంపస్ నుండి దాదాపు 2 కి.మీ దూరంలో ఉన్న బీబీనగర్ సరస్సు ఒడ్డున కనుగొన్నారు. నిపుణులైన ఈతగాళ్ళు గురువారం తెల్లవారుజామున సరస్సులో వెతికి మృతదేహాన్ని గర్తించారు. పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

"ఆత్మహత్య లేఖ ఏదీ లేదు.. అతను అదృశ్యమయ్యే ముందు ఎటువంటి బాధ లేదా అసాధారణ ప్రవర్తనను చూపించలేదు" అని బీబీనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం. ప్రభాకర్ రెడ్డి అన్నారు. "అతను ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలేమిటో అతని కుటుంబానికి కూడా తెలియదు" అని చెప్పారు. అభిజీత్ తండ్రి జె. జోసెఫ్ కేరళ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత అతని మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story