Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన చట్నీ.. భార్య ఆత్మహత్య
చట్నీ ఎక్కువ వేశావని భర్త గొడవ పడడంతో.. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 9 Jan 2024 1:15 PM ISTHyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన చట్నీ.. భార్య ఆత్మహత్య
నేటి సమాజంలో యువతకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువైందని చెప్పవచ్చు.. ఇష్టమైన సీరియల్ చూడనివ్వట్లేదని.. కోడి కూర వండలేదని, కోప్పడ్డారని.. ప్రతినిత్యం సెల్‌ఫోన్‌లో గడుపుతున్నావని మందలించారని.. ఇలా చిన్న చిన్న విషయాలకే యువత బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చట్నీ ఎక్కువ వేశావని భర్త గొడవ పడడంతో.. ఆ భార్య బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.... కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని గోప తండాకు చెందిన రమణ అనే యువకుడు.. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని పెగళ్లపాడ కు చెందిన బానోతు చందన (25) అనే యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. చందన ఒక ఆభరణాల దుకాణంలో పనిచేస్తుంది. వీరిద్దరూ రూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ఇంద్రానగర్లోని అపార్ట్‌మెంట్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో చట్నీ ఎక్కువగా వేశావని రమణ భార్యతో గొడవ పడ్డాడు. సోమవారం ఉదయం రమణ యధావిధిగా డ్యూటీకి వెళ్ళాడు. అయితే భార్య చందన పలుమార్లు భర్తకు వీడియో కాల్ చేసింది. అందుకు రమణ స్పందించకపోవడంతో ఫోన్ చేసి తనతో కావాలనే గొడవ పడుతున్నావని, తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది.
రమణకు అనుమానం వచ్చి వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఇంటి యజమాని ఇరుగుపొరుగు వాళ్లకు సమాచారం అందించాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపు తట్టినా కూడా చందన తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా చందన ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. స్థానికులు వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. కానీ చందన అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.