దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా మాకేం సిగ్గు అంటూ కామాంధులు ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఆడవారు కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ మధ్య సామూహిక అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
భర్తను కట్టేసి మహిళపై ఆమె మరిది సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం భార్యాభర్తలిద్దరూ బాలాజీ ఆలయానికి వెళ్లి బైక్‌పై తిరిగివస్తుండగా.. బరన్-అత్రు రాష్ట్ర రహదారిపై ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఇద్దరిని బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మహిళ భర్తను కట్టిపడేశారు. ఆపై మహిళను ఐదుగురు లైంగికంగా వేధించారు.
జరిగిన ఘటనపై బాధిత జంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దినేష్ అనే వ్యక్తితో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని.. దినేష్ బాధిత మహిళ మొదటి భర్త సోదరుడని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.