ఘోరం.. భార్యను హ‌త్య చేసిన భ‌ర్త‌.. పెళ్లై నెలరోజులు కూడా కాలే..

Husband kills wife in Hyderabad.క‌ట్టుకున్న భ‌ర్తే ఆ యువ‌తి ప‌ట్ల కాల‌య‌ముడు అయ్యాడు. పెళ్లై నెల‌రోజులు కూడా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2021 10:04 AM GMT
ఘోరం.. భార్యను హ‌త్య చేసిన భ‌ర్త‌.. పెళ్లై నెలరోజులు కూడా కాలే..

క‌ట్టుకున్న భ‌ర్తే ఆ యువ‌తి ప‌ట్ల కాల‌య‌ముడు అయ్యాడు. పెళ్లై నెల‌రోజులు కూడా నిండ‌కుండానే భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గురైంది న‌వ వ‌ధువు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో బాచుప‌ల్లి ప‌రిధిలోని ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లో జ‌రిగింది. మృతురాలి కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన‌ గంగారాం కుమారై సుధారాణిని కామారెడ్డి ప‌ట్ట‌ణానికే చెందిన కిర‌ణ్‌కు ఇచ్చి గ‌త నెల(ఆగ‌స్టు) 27న ఘ‌నంగా వివాహం చేశారు. 14ల‌క్ష‌ల న‌గదు, ఓ ఫ్లాటు, 10తులాల బంగారాన్ని క‌ట్నం కింద ఇచ్చారు.

కాగా.. వివాహ‌మైన రెండో రోజు నుంచే భార్య‌ని అనుమానించ‌డం మొద‌లుపెట్టాడు కిర‌ణ్‌. కొద్ది రోజుల క్రితం సుధారాణి గొంతు పిలిసి చంపేందుకు య‌త్నించాడు. పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగిన పంచాయ‌తీలో రాజీ కుద‌ర్చి కుమారైను కాపురానికి పంపారు. కాగా వారం కింద‌ట‌.. భార్యను తీసుకుని హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లోని సొంత ఇంట్లోకి షిప్ట్ అయ్యాడు కిరణ్ కుమార్. కుమారైను చూసేందుకు రావాల‌ని కిర‌ణ్‌.. అత్త‌మామ‌ల‌కు ఫోన్ చేశాడు. దీంతో వారు మ‌ధ్యాహ్నాం ఒంటి గంట క‌ల్లా కామారెడ్డి నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు. బెల్ కొట్ట‌గా ఎవ‌రూ తీయ‌లేదు. ఎంత పిలిచినా ఎవ‌రూ స్పందించ‌లేదు. ఇంట్లోని వారు ప‌డుకుని ఉంటార‌ని బావించి అలాగే మూడు గంట‌ల పాటు వేచి చూశారు. సాయంత్రం మ‌రోసారి పిలిచినా ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డంతో కిర‌ణ్ బంధువుల‌కు స‌మాచారం అందించారు.

వారు రాత్రి 9 గంట‌ల‌కు వ‌చ్చి త‌లుపులు ప‌గుల కొట్టి లోప‌లికి వెళ్లి చూసి షాకైయ్యారు. బెడ్‌పై సుధారాణి విగ‌త‌జీవిగా ప‌డి ఉండ‌గా.. ప‌క్క‌నే కిర‌ణ్ కొన‌ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. సుధారాణి గొంతు, కాళ్లు, చేతులు కోసిన కిరణ్ కుమార్.. తాను కూడా గొంతు, ఎడమ చేయి కోసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. కిర‌ణ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన సుధారాణి బంధువులు.. కామారెడ్డిలోని కిరణ్‌కుమార్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. మృతురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it