పుట్టిన బిడ్డ నల్లగా ఉందని.. అనుమానంతో భార్యను చంపిన భర్త
Husband Killed Wife In Front Of Two Years Old Girl Child. కన్న బిడ్డ ముందే తల్లిని దారుణంగా చంపాడో తండ్రి. ఆ తర్వాత మూర్ఛ వచ్చి పడిపోయిందని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
By అంజి Published on 25 Sep 2022 8:57 AM GMTకన్న బిడ్డ ముందే తల్లిని దారుణంగా చంపాడో తండ్రి. ఆ తర్వాత మూర్ఛ వచ్చి పడిపోయిందని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో వైద్యులు తల్లి చనిపోయిందని ధృవీకరించారు. దీంతో మహిళ సహజంగా చనిపోయిందని అంతా అనుకున్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేశారు. అయితే తండ్రే తల్లిని గొంతు పిసకడంతో కింద పడిపోయిందని రెండున్నరేళ్ల బాలిక పోలీసులకు చెప్పడంతో మహిళ మరణం వెనుక మిస్టరీ వీడింది. చిన్నారి సాక్ష్యంతో కేసు మిస్టరీ మర్డర్‌గా మారింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని సిలాటిగావ్‌కు చెందిన మాణిక్ ఘోష్‌కు కారాగావ్‌కు చెందిన లిపికా మండల్‌తో ఏడేళ్ల కిందట పెళ్లి జరిగింది. వివాహం తర్వాత వారూ ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు వెళ్లారు. రెండేళ్ల కిందట వారికి మహి అనే బిడ్డ జన్మించింది. ఆ చిన్నారి కాస్త నల్లగా ఉందని, లిపికాపై మాణిక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే లిపికా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ ఏడాది జూన్‌లో అత్తింటివారు కారాగావ్ వెళ్లి లిపికాకు సర్దిచెప్పి భర్త మాణిక్ దగ్గరకు పంపారు.
సెప్టెంబర్ 18న లిపికాను గొంతు పిసికి చంపాడు. ఆ తర్వాత లిపికాకు ముర్ఛ వచ్చిందని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మెడపై కమిలినట్లు గుర్తులు కనిపించాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది కాకినాడ పోలీసులకు ఫోన్ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత మహిళకు పోస్టుమార్టం చేసి దహన సంస్కారాలు పూర్తిచేశారు. లిపికా తల్లిదండ్రులు మంగళవారం కాకినాడ వెళ్లి, చిన్నారిని తమతో కారాగావ్ తీసుకెళ్ళారు.
ఈ క్రమంలో తన తల్లి ఎలా చనిపోయిందో, తండ్రి ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చీ రానీ మాటలతో తన తాత తపన్ మండల్‌కు చెప్పింది. చేతులతో సైగలు చేస్తూ తల్లిని ఎలా చంపాడో తాతకు వివరించింది. బాధితురాలి తండ్రి వెంటనే శనివారం చిన్నారితో కలిసి ఉమ్మర్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ బాలిక జరిగిన విషయాన్ని పోలీసులకూ తెలిపింది. ఒడిశా పోలీసులు, కాకినాడ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్టు చేశారు. పుట్టిన బిడ్డ నల్లగా ఉందని అనుమానంతోనే మాణిక్ భార్యను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.