చిన్న చిన్న మనస్పర్థలకు కూడా చావే శరణ్యం అనుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. భార్య గొడవపడితే.. బుజ్జగించో అదీ కుదరకపోతే కాస్త భయపెట్టో దారిలోకి తెచ్చుకోవాలి.. అంతే కానీ ప్రాణాలు తీసుకుంటారా? తాజాగా ఓ భర్త.. తమ ఇంట్లో బంధువుల పండుగకు భార్య రాలేదని ఉరేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 'మీ బంధువుల పెళ్లిళ్లకు నేను వచ్చాను.. మా బంధువుల ఇంట్లో బోనాలకు నువ్వెందుకు రావడం లేదు' అని భార్యపై అలిగిన భర్త.. ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలో ఉండే సాయి కార్తీక్ గౌడ్ (33), భార్య రవళితో కలిసి ఈ నెల 12న ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి కందుకూరు మండలం బేగంపేట వెళ్లాడు. ఈ క్రమంలోనే పుట్టింటివారు కావడంతో రవళి అక్కడే ఉండిపోయింది. పెళ్లి అయిపోగానే కార్తీక్ శనివారం ఇంటికి వచ్చాడు. ఆదివారం మీర్‌పేటలో జరిగే బోనాల పండుగకి తన పిన్ని ఇంటికి వెళ్దామని కార్తీక్ తన భార్యకి చెప్పాడు. ఈ విషయాన్ని తేలికగా తీసుకున్న భార్య.. తిరిగి అత్తగారింటికి రాలేదు. దీంతో కార్తీక్ తీవ్ర మనస్తాపం చెందాడు.
భార్య రవళికి వీడియో కాల్ చేసి.. 'మీ బంధువుల ఇళ్లల్లో పెళ్లిళ్లు, ఇతర వేడుకలను నేను వస్తున్నా.. మా వాళ్ల వద్దకు నువ్వెందుకు రావు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఇంట్లో దులానికి ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో కార్తీక్ చేతి నుంచి ఫోన్ కింద పడటంతో ఆత్మహత్య దృశ్యాలు కనబడలేదు. వెంటనే ఉలిక్కిపడ్డ రవళి తనభర్త వద్దకు బయల్దేరింది. ఈ క్రమంలోనే పక్కింటి వాళ్లకు ఫోన్లు చేస్తూ భర్తను కాపాడాలని వేడుకుంది. వాళ్లు ఇంటికి చేరుకునేప్పటికీ కార్తీక్ మృతిచెందాడు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.