భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌.. అనాథ‌గా మారిన 9 నెల‌ల చిన్నారి

Husband commits suicide after wife death in Rangareddy District.భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sept 2022 10:56 AM IST
భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌.. అనాథ‌గా మారిన 9 నెల‌ల చిన్నారి

భార్య అంటే అత‌డికి ఎంతో ప్రేమ‌. త‌న‌కు ఉన్న‌దాంట్లో ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. స‌జావుగా సాగిపోతున్న వీరి జీవితాన్ని చూసి విధికి క‌న్ను క‌ట్టిందేమో.. అనారోగ్యంతో భార్య మృతి చెంద‌గా.. ఆమె లేని జీవితం త‌న‌కు వ‌ద్ద‌ని రైలు కింద ప‌డి భ‌ర్త ఆత్మ‌హ్య చేసుకున్నాడు. త‌ల్లిదండ్రుల మృతితో 9 నెల‌ల చిన్నారి అనాథ‌గా మారింది. ఈ విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌హేశ్వ‌రం మండ‌లం తుప్రాఖుర్దు గ్రామంలో బాల‌కృష్ణ‌(27), మ‌మ‌త‌(25) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి 9 నెల‌ల పాప ఉంది. గ‌త కొద్ది రోజులుగా మ‌మ‌త అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతుంది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం మ‌మ‌త మృతి చెందింది. బంధువులు కారులో మ‌మ‌త మృత‌దేహాన్ని తీసుకుని గ్రామానికి బ‌య‌లుదేరారు. ముందుగా ఇంటికి వెళ్లి అంతిమ యాత్ర‌కు ఏర్పాట్లు చేస్తానంటూ బాల‌కృష్ణ ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్లాడు.

అయితే.. అత‌డు గ్రామానికి వెళ్ల‌లేదు. శంషాబాద్ మండ‌లం తొండుప‌ల్లి వ‌ద్ద రైలుకు ఎదురెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గంట‌ల వ్య‌వ‌ధిలో భార్యాభ‌ర్త‌ల మృతితో గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story