హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ ప్రమాదం సంభవించింది. ఉనా జిల్లాలో బాణాసంచా తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో మంగళవారం జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందగా, మరో 12 మందికి కాలిన గాయాలయ్యాయని జిల్లా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉనా జిల్లాలోని బతు పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఉనా డిప్యూటీ కమిషనర్ రాఘవ్ శర్మ తెలిపారు. ప్రాథమికంగా చనిపోయిన, గాయపడిన వారిలో ఎక్కువ మంది వలస కూలీలు అని ఆయన తెలిపారు.
పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నారు. ఉనా జిల్లా పోలీసు చీఫ్ అర్జిత్ సేన్ మాట్లాడుతూ... జిల్లా పోలీసులు గాయపడిన కార్మికులందరినీ చికిత్స కోసం ఉనాలోని జిల్లా ఆసుపత్రికి పంపించారని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నిర్వహణలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉందని ఆయన వెల్లడించారు.