ఏలూరులో దారుణం.. విద్యార్థినులపై వార్డెన్ భర్త అఘాయిత్యం.. కాళ్లు, చేతులు కట్టేసి..

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ భర్త శశికుమార్‌ బాలికల పాలిట కీచకుడిగా మారాడు.

By అంజి  Published on  18 Sept 2024 9:35 AM IST
ఏలూరులో దారుణం.. విద్యార్థినులపై వార్డెన్ భర్త అఘాయిత్యం.. కాళ్లు, చేతులు కట్టేసి..

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ భర్త శశికుమార్‌ బాలికల పాలిట కీచకుడిగా మారాడు. ఫొటో షూట్‌ల పేరుతో బయటికి తీసుకెళ్లి కాళ్లూ చేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు తిరిగితే చెంపపై కొట్టి, జుట్టు పీకేసీ ఈడ్చుకెళ్లి మోకాళ్లపై కూర్చోబెడుతున్నాడని వాపోయారు. అతని వేధింపులు తట్టుకోలేక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఆశ్ర‌మంలో 50 మంది బాలికలు వ‌స‌తి పొందుతూ వేర్వేరు విద్యా సంస్థ‌ల్లో చ‌దువుకుంటున్నారు. క‌రోనా టైంలో ఆశ్ర‌మ నిర్వాహ‌కులు హాస్టల్ నిర్వహణను ప‌ట్టించుకోలేదు. దీంతో ఏలూరుకి చెందిన శ‌శికుమార్ దానిని చేజిక్కించుకున్నాడు. వార్డెన్‌గా త‌న రెండో భార్య మ‌ణిశ్రీని, విద్యార్థినుల సంర‌క్ష‌కురాలిగా మేన‌కోడ‌లు లావ‌ణ్య‌ని నియమించాడు. అప్పటి నుండి ఫొటో షూట్‌ల కోస‌మ‌ంటూ శ‌శికుమార్ బాలిక‌ల్ని దూర ప్రాంతాల‌కు తీసుకెళ్లి, అక్క‌డ వారిపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్నాడని బాలికలు ఆరోపిస్తున్నారు. అడ్డు చెబితే ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడ‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌దుల సంఖ్య‌లో బాలిక‌ల‌ను లైంగికంగా వేధించిన‌ట్లు బాధిత బాలిక‌లు చెబుతున్నారు. వార్డెన్‌ ఆగ‌డాల‌ను భ‌రించ‌లేని ముగ్గురు బాలిక‌లు మంగ‌ళ‌వారం రాత్రి టూ టౌన్ పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు.

Next Story