గ్యాంగ్ స్టర్ 'సీజింగ్' రాజాను కాల్చి చంపిన పోలీసులు
చెన్నైలోని అక్కరై ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో "సీజింగ్ రాజా" అనే క్రిమినల్ ను కాల్చి చంపారు.
By Medi Samrat Published on 23 Sep 2024 9:42 AM GMTచెన్నైలోని అక్కరై ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో "సీజింగ్ రాజా" అనే క్రిమినల్ ను కాల్చి చంపారు. నివేదికల ప్రకారం, రాజా అంతకు ముందు రోజు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్ అయ్యాడు. తదుపరి విచారణ కోసం చెన్నైకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. BSP నాయకుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో సంబంధం ఉన్న వ్యక్తులను ఎన్‌కౌంటర్ చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
'సీజింగ్' రాజా సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని అక్కరైలో పోలీసు బృందంపై దాడికి ప్రయత్నించగా, పోలీసులు కాల్చి చంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో ‘సీజింగ్’ రాజా అలియాస్ ఎన్. రాజా వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. చెంగల్‌పట్టు కోర్టు అతనిని నేరస్థుడిగా ప్రకటించినప్పటి నుండి తాంబరం పోలీసు కమిషనరేట్ ద్వారా నగరం వెలుపల పోస్టర్లు కూడా అతికించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రహస్య స్థావరంలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కోసం తిరిగి నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. నేరంలో ఉపయోగించిన ఆయుధాలను రికవరీ చేయడానికి అతన్ని అక్కరైకి తీసుకెళ్లారు. అతను అకస్మాత్తుగా స్వదేశీ రివాల్వర్‌ను తీసుకుని పోలీసులపై కాల్చాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రాజాపై కాల్పులు జరపాల్సి వచ్చిందని సమాచారం. ఈ ఘటనలో మరెవరూ గాయపడలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఐదు హత్యలు, హత్యాయత్నాలు సహా పలు నేరాలకు సంబంధించి రాజాపై 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్కరైలో పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించగా, పోలీసుల బృందం రాజాపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక నివేదిక తెలిపింది.