పిల్ల‌లు లేర‌ని భూతవైద్యం కోసం వచ్చిన మహిళపై తాంత్రికుడు అత్యాచారం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో దారుణం వెలుగులోకి వ‌చ్చింది. పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో శనివారం మధ్యాహ్నం భూతవైద్యం కోసం వచ్చిన హత్రాస్‌కు చెందిన ఓ మహిళను తాంత్రికుడు పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

By Medi Samrat
Published on : 14 July 2025 3:56 PM IST

పిల్ల‌లు లేర‌ని భూతవైద్యం కోసం వచ్చిన మహిళపై తాంత్రికుడు అత్యాచారం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో దారుణం వెలుగులోకి వ‌చ్చింది. పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో శనివారం మధ్యాహ్నం భూతవైద్యం కోసం వచ్చిన హత్రాస్‌కు చెందిన ఓ మహిళను తాంత్రికుడు పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సమయంలో ఆమె భ‌ర్త‌ గుడిలో కూర్చుని ఉన్నాడు. బాధితురాలు ఫిర్యాదుపై పోలీసులు తాంత్రికుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం ఉదయం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

22 ఏళ్ల యువతి, ఆమె భర్త పిల్లలు లేకపోవడంతో ఆందోళన చెందారు. ఆ గ్రామానికి చెందిన 61 ఏళ్ల తాంత్రిక్ చంద్రపాల్ సింగ్ ద్వారా భూతవైద్యం చేయించాలని మునియాఖేడా నివాసి అయిన తన బంధువు(కోడ‌లు వ‌రుస‌)ను ఆ మహిళ కోరింది. బంధువు తాంత్రికుడితో మాట్లాడి జూలై 5న అతనికి ఫోన్ చేసింది. తాంత్రికుడు ఆ మహిళకు భూతవైద్యం చేసి ఇంటికి పంపించాడు.

శనివారం మరోసారి ఫోన్ చేయడంతో ఆ మహిళ తన భర్త, బంధువుతో కలిసి మధ్యాహ్నం ఆలయానికి చేరుకుంది. లడ్డూలను పొలంలో పాతిపెట్టాలని, నిమ్మకాయలు కోయాలని తాంత్రికుడు చెప్పాడు. ఇంతలో బంధువు రేషన్ కొనేందుకు దుకాణానికి వెళ్లింది. ఆ స‌మ‌యంలో లడ్డూలు పాతిపెట్టి, నిమ్మకాయలు కోస్తామంటూ మహిళను చంద్రపాల్ సింగ్ ఆలయానికి 400 మీటర్ల దూరంలోని పొలంలో ఉన్న గొయ్యి వద్దకు తీసుకెళ్లాడు. గుడిలో ఉండమని భర్తను చెప్పారు.

అక్కడ తాంత్రికుడు మహిళను వేధించి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. దాదాపు పావుగంట పాటు ఇద్దరూ గొయ్యిలోనే ఉన్నారు. ఇంతలో బంధువు గుడికి చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన మహిళ అత్యాచారం గురించి తన భర్త, బంధువుకి చెప్పింది. దీంతో వారు విస్తుపోయారు. ఆ సమయంలో తాంత్రికుడు అక్క‌డి నుంచి పారిపోయాడు.

నిందితుడిని అతని ఆలయం సమీపంలో అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ గిరి తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 32 ఏళ్ల మ‌హిళ బంధువుకు కూడా పిల్లలు లేరు. ఆమె ఆరేళ్ల క్రితం ఇదే తాంత్రికుడి ద్వారా భూతవైద్యం చేయించుకుంది. దీని తర్వాత ఆమె తల్లి అయింది. అందువల్ల బాధిత‌ స్త్రీ తాంత్రికుడిని విశ్వసించింది.

Next Story