హత్రాస్‌లో మరో దారుణం.. అత్యాచార బాధితురాలి తండ్రిని కాల్చి చంపారు
Hathras man accused of sexual assault out on bail kills survivor's father.హత్రాస్‌లో అత్యాచార బాధితురాలి తండ్రిని దుండగుడు కాల్చి చంపాడు
By తోట వంశీ కుమార్
గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హత్రాస్‌లో అత్యాచార బాధితురాలి తండ్రిని దుండగుడు కాల్చి చంపాడు. హత్రాస్ పోలీసు చీఫ్ వినీత్ జైస్వాల్ అందించిన సమాచారం ప్రకారం.. 2018లో బాధితురాలిపై గౌరవ్ శర్మ అనే దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. తనపై ఫిర్యాదు చేసిందన్న కక్షతో గౌరవ్ తన పగ తీర్చుకునేందుకు సమయం కోసం ఎదురు చూశాడు.
గత నెల 28న బాధితురాలి కుటుంబం ఆలయానికి వెళ్లగా, గౌరవ్ శర్మ కూడా తన స్నేహితులతో అక్కడికి చేరుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె తండ్రితో అతడు గొడవ పడ్డాడు. నీ కూతురి చేత నాపై పోలీసులకు ఫిర్యాదు చేయిస్తావా.. అంటూ దుర్భషలాడుతూ ఘర్షణకు దిగాడు. ఇలా ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఆగ్రహించిన శర్మ గన్ తీసి ఆయనపై విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఛాతీ, శరీర ఇతర భాగాలపై కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణం అంతా నెత్తురుతో తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా, కాల్పులు జరిపిన శర్మ, అతని స్నేహితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆస్పత్రిలో తన తండ్రిని చూడడానికి వచ్చిన బాధితురాలు విలపిస్తూ తనకు న్యాయం చేయాలని, తనపట్ల కిరాతకంగా ప్రవర్తించిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
నిందితులను వదిలిపెట్టకండి: సీఎం యోగి
కాగా.. ఈ ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. నిందితులను వదిలిపెట్టేది లేదని, వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో ఇలా అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నా మీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.