Telangana: స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం.. బాలికలపై అధికారి లైంగిక వేధింపులు
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం వెలుగు చూసింది. బాలికలపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి.
By అంజి Published on 13 Aug 2023 9:30 AM ISTTelangana: స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం.. బాలికలపై అధికారి లైంగిక వేధింపులు
హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం వెలుగు చూసింది. బాలికలపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారి బాలికల గదిలోకి అర్ధరాత్రి చోరబడి.. నిత్యం వేధింపులకు గురి చేశాడు. సాయంత్రం సమయంలో ఆటవిడుపు పేరుతో వికృతి చేష్టలకు పాల్పడ్డాడు. ఆట విడుపు పేరుతో కారులో బాలికలను ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినులను బలవంతంగా కారెక్కించుకొని తీసుకెళ్లి జుగుప్సాకరమైన చేష్టలకు ఒడిగట్టాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలికలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల అండదండలతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని బాలికలు చెప్పారు.
కాగా ఈ స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిని అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. స్పోర్ట్స్ స్కూల్‌లో సదరు అధికారికి మహిళా ఉద్యోగితో పాటు మరో ఇద్దరు సీనియర్ కోచ్‌లు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ''కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో.. ఇలాంటి వాటికి తావు ఉండకూడదు.. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న.. అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలి.. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.. బాధితురాళ్లకు న్యాయం చేయాలంటూ''.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కవిత కోరారు.
కవిత ట్వీట్‌కి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేశామని చెప్పారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.