Hyderabad: కాళ్లు, చేతులు కట్టేసి, కుక్కర్‌తో తలపై కొట్టి మహిళ దారుణ హత్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు

By -  Knakam Karthik
Published on : 11 Sept 2025 8:50 AM IST

Crime News, Hyderabad, Kukatpalli, Woman Murdered,

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పని చేసే ఇద్దరు యువకులు ఆమెను చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి.. చిత్రహింసలు పెడుతూ.. తలపై కుక్కర్‌తో కొట్టి హత్య చేశారు. భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక.. అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి.. యజమానికి చెందిన బైక్‌ మీదనే పరారయ్యారు. బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.

ప్రాథమిక దర్యాప్తులో ఇంట్లో పనిచేసిన ఇద్దరు బీహార్ యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు నగలు, నగదును అపహరించి బైక్‌పై పరారైనట్లు సమాచారం. ఇదే సమయంలో సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా లిఫ్ట్‌లో ప్రయాణించిన దృశ్యాలు రికార్డ్ కావడం దర్యాప్తుకు మరింత బలం చేకూర్చింది. స్థానికులు భయాందోళనలకు గురవుతుండగా.. పోలీసులు అపార్ట్‌మెంట్ భద్రతా చర్యలను పునఃసమీక్షిస్తున్నారు.

బాధిత దంపతులు రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ (50) ఫతేనగర్‌లో స్టీలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నారు. కుమారుడు శుభం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. స్వాన్‌ లేక్‌లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన రోషన్‌ తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు ఝార్ఖండ్‌లోని తన గ్రామానికే చెందిన హర్ష్‌ను 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు.

బుధవారం ఉదయం రాకేశ్ అగర్వాల్, శుభం ఇద్దరూ దుకాణానికి వెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్నారు. సాయంత్రం ఐదింటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో రాకేశ్ ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పటికీ స్పందన రాకపోవడంతో ప్లంబర్‌ను పిలిపించి, వెనుక వైపు ద్వారం ద్వారా లోపలికి వెళ్లి తలుపు తెరిపించారు. ఇంట్లోకి వెళ్లిచూడగా... రేణు అగర్వాల్ రక్త మడుగులో పడిపోయి, చేతులు, కాళ్లు తాళ్లతో కట్టబడి ఉన్న స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె తల, గొంతు, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా... హర్ష్, రోషన్‌లు ఈ దారుణానికి పాల్పడినట్లు వారు నిర్ధారించారు.

Next Story