మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటీవల కాలంలో యువత, విద్యార్థులు సైతం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు అందరితో సరదాగా ఉంటున్నారు. కుప్పకూలిన వెంటనే చనిపోతున్నారు. దీనికి కారణం గుండెపోటు. డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ మరణించిన సంఘటనలు చూశాం. తాజాగా పెళ్లిలో ఏడు అడుగులు వేస్తూ వరుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
నందపుర్ కఠ్‌గరియాకు చెందిన సమీర్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి దంత వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి రాణిఖేత్‌లోని శ్రీధర్‌గంజ్ మొహల్లాకు చెందిన యువతితో వివాహాన్ని నిశ్చయించారు. వీరి వివాహాం శుక్రవారం జరగాల్సి ఉంది.
ఉపాధ్యాయ్ ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వేదికపైన కూర్చోన్నాడు. పురోహితులు వివాహ తంతును మొదలుపెట్టారు. పెళ్లి తంతు ఒక్కొక్కటిగా పూర్తి అవుతోంది. వధువరులు ఇద్దరు ఏడు అడుగులు వేస్తుండగా సడెన్‌గా వరుడు సమీర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అక్కడ ఉన్న వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడి మరణానికి గుండెపోటు కారణమని చెప్పారు.
ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాద వాతావరణం నెలకొంది. వరుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.