సినిమా చూసి.. నానమ్మను కిరాతంగా హతమార్చిన మనవడు.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు
Grandmother Killed By Grandson For Money.ఓ సినిమా నుంచి స్పూర్తి పొందిన తండ్రీ కొడుకులు దారుణానికి పాల్పడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 8 Sep 2022 3:29 AM GMTఎంత కాదన్నా సినిమాల ప్రభావం సమాజంపై చాలా గట్టిగానే ఉందని చెప్పాలి. సినిమాల్లో హీరోలు చేసే పనులు చాలా మంది యువకులు అనుకరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా అనేది కల్పితం అనే విషయాన్ని తెలుసుకోవడం లేదు. సినిమా నుంచి మంచిని తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు కానీ.. చాలా మంది చెడును తీసుకుంటూ నేరస్తులుగా మారుతున్నారు. ఇలా ఓ సినిమా నుంచి స్పూర్తి పొందిన తండ్రీ కొడుకులు దారుణానికి పాల్పడ్డారు.
ఆస్తి కోసం సొంత తల్లి అనే కనికరం లేకుండా కుమారుడు, నానమ్మ అని చూడకుండా మనువడు ఓ వృద్దురాలిని అతి కిరాతంగా హతమార్చారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణె నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉషా విఠల్ గైక్వాడ్(64) ఆర్మీ క్యాంప్‌లో పని చేసేవారు. రిటైర్‌మెంట్ అనంతరం ఆమె కేశవనగర్‌లో స్థిరపడింది. ఆమెతో పాటు కుమారుడు సందీప్ గైక్వాడ్(45), కోడలు, మనువడు సాహిల్ గైక్వాడ్(20) ఉంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆగస్టు 5న అత్తా కోడళ్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు మధ్యాహ్నా సమయంలో ఉషా నిద్రపోతుండగా.. మనువడు సాహిల్ ఆమెపై దాడి చేశాడు.
ఆమెను బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తండ్రితో కలిసి మృతదేహాన్ని 9 ముక్కలుగా చేశారు. ఆ శరీరభాగాలను సంచుల్లో వేసుకుని ముథా నదిలో కొన్నింటిని పక్కనే ఉన్న చెత్త డిపోలో మరికొన్ని సంచులను పడేశారు. అనంతరం ఉష మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వృద్ధురాలి ఆచూకి దొరకలేదు. మృతురాలి కుమారై తన అన్నపై అనుమానం వ్యక్తం చేయడంతో.. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అసలు నిజం బయటపడింది. నానమ్మ ఆస్తిపై కన్నేసిన సాహిల్ ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఓ మలయాళ రిమేక్ చిత్రం చూశాకే తనకు ఈ ఆలోచన వచ్చినట్లు చెప్పాడు. పోలీసులు తండ్రీ, కొడుకులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.