ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఐదు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. జూన్ 6వ తేదీన టైలర్ వద్దకు వెళ్తుండగా బాలిక కిడ్నాప్‌కు గురైనట్లు సమాచారం. బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. సాంకేతిక నిఘా ఉత్తరాఖండ్‌లోని ఒక ప్రదేశంలో బాలికను కనుగొనడంలో సహాయపడింది. తదనంతరం, పోలీసులు ఆమెను ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ నుండి రక్షించి ముగ్గురిని అరెస్టు చేశారు.
ముగ్గురిని షా ఆలం (50), ఇర్ఫాన్ అలియాస్ బాబు (30), నదీమ్ ఖురేషీ (25)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు తనను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని యువతి పోలీసులకు తెలిపింది. తనకు మత్తు మందు ఇచ్చి బెదిరించారని చెప్పింది. బాలికతో స్నేహం చేసి కిడ్నాప్ చేసినట్లు ప్రధాన నిందితుడు ఆలం పోలీసులకు తెలిపాడు. ఆలమ్‌పై ఒక హత్య సహా ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారం కింద భారత శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేసి, పోక్సో చట్టంలోని సెక్షన్లు చేర్చారు.