ఆ చిన్నారికి పుట్టినరోజే చివరి రోజైంది

Girl died as branch fell on her head.ఆ చిన్నారి ఉద‌యాన్నే నిద్ర లేచింది. త‌లంటు స్నానం చేసి కొత్త బ‌ట్ట‌లు వేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Oct 2022 10:07 AM IST
ఆ చిన్నారికి పుట్టినరోజే చివరి రోజైంది

ఆ చిన్నారి ఉద‌యాన్నే నిద్ర లేచింది. త‌లంటు స్నానం చేసి కొత్త బ‌ట్ట‌లు వేసుకుంది. పుట్టిన‌రోజు కావ‌డంతో తాత ఆశీస్సులు తీసుకుంది. పాఠ‌శాల‌కు వెళ్లి అంద‌రికి చాకెట్లు పంచింది. అయితే.. ఆ చిట్టిత‌ల్లికి తెలియ‌దు.. పుట్టిన రోజే త‌న‌కు ఆఖ‌రి రోజు అవుతుందని. పాఠ‌శాల నుంచి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు మార్గ‌మ‌ధ్యంలో ఓ చెట్టుకొమ్మ పాప ప్రాణాల‌ను బ‌లిగొంది.

లిఖిత (12) అనే చిన్నారి తండ్రి అయిదు సంవ‌త్స‌రాల క్రితం చ‌నిపోగా త‌ల్లి జ్యోత్స్న హైద‌రాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్నారి లిఖిత ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణంలో తాత‌య్య పూర్ణ చంద్రరావు వ‌ద్ద ఉంటూ చ‌దువుకుంటోంది. తండ్రి లేని లోటును తాతయ్య తీర్చుతూ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్నారు.

శుక్ర‌వారం లిఖిత పుట్టిన రోజు కావ‌డంతో సంతోషంగా పాఠ‌శాల‌కు వెళ్లి పాఠ‌శాల‌లోని టీచ‌ర్లు, విద్యార్థుల‌కు చాక్లెట్లు పంచింది. మ‌ధ్యాహ్నం తాత‌య్య పూర్ణ‌చంద్ర‌రావు బైక్ పై లిఖిత‌ను ఇంటికి తీసుకువ‌స్తుండ‌గా ఘోరం జ‌రిగింది. తాల్ల‌మ‌డ గ్రామం వ‌ద్ద ర‌హ‌దారి ప‌క్క‌న ఉన్న చెట్టు కొమ్మ విరిగి చిన్నారి త‌ల‌పై ప‌డింది. తీవ్రంగా గాయ‌ప‌డిన చిన్నారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతి చెందింది.

త‌న క‌ళ్ల ముందే మ‌న‌వ‌రాలు క‌న్నుమూయ‌డంతో పూర్ణ‌చంద్ర‌రావు గుండెలు అవిసేలా రోదించారు. పాఠ‌శాల‌లో పుట్టిన రోజు వేడుక‌ల ఫోటోలు హైద‌రాబాద్‌లోని త‌ల్లికి వాట్సాప్‌లో పంప‌గా ఆమె చూసి మురిసిపోయింది. అయితే.. అంత‌లోనే కూతురు ఇక లేదు అనే వార్త ఆమెను హ‌తాశురాలిని చేసింది.

Next Story