భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద రూ.1.18 కోట్ల విలువైన 594 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. సోమవారం భద్రాచలంలో ఏఎస్పీ బి రోహిత్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక అటవీ చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఎస్‌ఐ మధుప్రసాద్, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టగా రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వారు కార్లను ఆపడంతో అందులో ఉన్న ఇద్దరు స్మగ్లర్లు పారిపోగా.. జిల్లాలోని సారపాకకు చెందిన అన్వేష్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అన్వేష్.. తాను, మరో ఇద్దరు కలిసి ఒడిశాలోని మల్కన్‌గిరి వద్ద సప్లయర్లు, రాము, మహేందర్‌ల నుంచి గంజాయిని సేకరించి, తమిళనాడులోని చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నామని, దానిని ఓ చిరువ్యాపారుడైన జయ కుమార్‌కు అందజేస్తున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అన్వేష్‌ను సోమవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. పరారైన స్మగ్లర్లు అన్వేష్ బంధువులు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మారేడుమిల్లి పోలీసులు గతంలో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయి స్మగ్లింగ్‌కు ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు రోహిత్ రాజ్ తెలిపారు.