ఏలూరులో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.
By అంజి Published on 11 July 2023 12:40 PM ISTఏలూరులో దారుణం.. నాలుగో తరగతి విద్యార్థి హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన కొడుకు.. ఇంత చిన్న వయస్సులో మరణించడంతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని పులిరామన్నగూడెంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ గోగుల అఖిల్ అనే విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్నాడు. అఖిల్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సోమవారం అర్థరాత్రి తర్వాత విద్యార్థి హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
విద్యార్థి హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న బుట్టాయగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అఖిల్‌ను ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే విషయాలపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి హత్య గురించి హాస్టల్ సిబ్బంది మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు హాస్టల్‌లోకి వచ్చి.. అఖిల్‌ను బయటకు తీసుకువెళ్లరాని తోటి విద్యార్థులు వివరించారు. ఉదయం లేచి చూసేసరికి హాస్టల్ బయట అఖిల్ మరణించి ఉన్నట్లు తెలిపారు. అఖిల్ ఇకలేడన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థి మరణంతో అతని స్వగ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.