బాలికపై నలుగురు యువకులు గ్యాంగ్‌ రేప్‌.. హైదరాబాద్‌లో ఘటన

Four youngsters gang rape minor girl in Hyderabad. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై నలుగురు

By అంజి  Published on  8 Feb 2023 3:23 PM IST
బాలికపై నలుగురు యువకులు గ్యాంగ్‌ రేప్‌.. హైదరాబాద్‌లో ఘటన

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం వెలుగులోకి వచ్చిందీ ఈ ఘటన. చాంద్రాయణగుట్టలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న 16 ఏళ్ల బాలిక ఫిబ్రవరి 4న సమీపంలోని ఫార్మసీలో మందులు కొనేందుకు వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఆమె వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ అదే మందును రాయితీ ధరకు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ట్రాప్ చేసింది.

ఆ మహిళ బాలికను కందికల్ గేట్ వద్దకు తీసుకువెళ్లిందని, అక్కడ మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులకు ఆమెను అప్పగించింది. మైనర్ బాలికతో వారు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఏడవడం ప్రారంభించింది. ఆపై, ఆమెను అక్కడ ఒక గదిలో బంధించిన నలుగురు యువకులు, శబ్దం బయటకు రాకుండా మ్యూజిక్ సిస్టమ్‌ను బిగ్గరగా ఉంచారు. అనంతరం ఆమెకు మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని బలవంతంగా తాగించి, మత్తులో ఉన్న యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను అక్కడికక్కడే వదిలి పారిపోయారు. బాలిక మత్తు నుంచి తేరుకుని మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుంది. జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి తెలియజేయగా, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులు, మహిళను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story