న్యూ ఇయర్ వేళ విషాదాలు.. తమిళనాడులో నలుగురు.. ఏపీలో ముగ్గురు దుర్మరణం
Four workers dead in cracker unit Blast in Tamil Nadu.కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామో లేదో వరుస విషాదాలు చోటు
By తోట వంశీ కుమార్ Published on 1 Jan 2022 7:15 AM GMTకొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామో లేదో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు రాష్రంలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మొత్తంగా కొత్త సంవత్సరం రోజున ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.
వివరాల్లోకి వెళితే..
తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకు న్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక విశాఖలోని ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన రెండు బైకులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు నిన్న రాత్రి 8గంటల నుంచి ఈ ఉదయం ఆరు గంటల వరకు ఆరిలోవ బీఆర్‌టీఎస్ రహదారిని మూసేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత రహదారిని తెరిచారు. రహదారిపై వాహనాలను అనుమతించిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.