మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును వాహనం ఢీకొనడంతో నలుగురు పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉజ్జయిని జిల్లాలో సోమవారం నాడు ట్రక్కును ఎదురుగా వస్తున్న జీపు ఢీకొనడంతో నలుగురు పాఠశాల విద్యార్థులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు. జిల్లాలోని నాగ్డా తహసీల్‌లోని నాగ్డా అన్హెల్ హైవే రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన పిల్లలను ఇండోర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. గాయపడిన పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఐసీయూలో చేర్చారు.
ఫాతిమా కాన్వెంట్ స్కూల్‌కు పిల్లలు వెళ్తుండగా ఉన్హెల్ పట్టణంలోని జిర్నియా ఫాటా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యేంద్ర శుక్లా తెలిపారు. హతిపల్కి గ్రామ సమీపంలోని నగ్డాలోని ఫాతిమా పాఠశాల పిల్లలతో ఉదయం 7.30 గంటలకు జీపు వెళ్తుండగా.. లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో మొత్తం 15 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఉజ్జయినిలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు. మృతి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్, ఎస్పీ సత్యేంద్ర కుమార్ శుక్లాతో పాటు అదనపు ఎస్పీ ఆకాష్ భూరియా, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన అనంతరం అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను బస్సులో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన చిన్నారులు 5వ తరగతి నుంచి 7వ తరగతి చదువుతుండగా, వీరి వయస్సు 11 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.