కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం.. నలుగురిని మింగిన బావి
Four people died after going to cleanup a well in Krishna District.బావిలో పూడిక తీసే పనికి వెళ్లిన కూలీలు మృతి చెందారు.
By తోట వంశీ కుమార్ Published on 17 Sept 2022 8:08 AM ISTబావిలో పూడిక తీసే పనికి వెళ్లిన కూలీలు మృతి చెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బుంటుమిల్లిలో జరిగింది. తండ్రీ కొడుకులతో పాటు మరో ఇద్దరు మరణించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. బంటుమిల్లిలో కొండా నాగేశ్వరరావు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. నాగేశ్వరరావు ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పూడిక తీసేందుకు నలుగురిని కూలీకి మాట్లాడుకున్నారు. బీఎన్‌ఆర్ కాలనీకి చెందిన వంజుల రామారావు(60), అతని కుమారుడు లక్ష్మీనారాయణ (35), ములపర్రు గ్రామానికి చెందిన పుప్పాల శ్రీనివాసరావు (53), ఎర్రయ్యలు పనికి వచ్చారు. బావి దాదాపు 15 అడుగుల లోతు ఉంది. ముందుగా.. శ్రీనివాసరావు తాడు కట్టుకుని లోపలికి దిగాడు. ఊపిరి ఆడడం లేదని, పైకి లాగమని కేకలు వేశాడు. పైన ఉన్నవారు లాగే లోపే స్పృహ కోల్పోయాడు.
అతడిని రక్షించే ప్రయత్నంలో లోపలికి దిగిన లక్ష్మీనారాయణ కూడా పైకి రాలేదు. వీరిద్దరికి ఏమైందని కంగారులో లోపలికి దిగిన రామారావు సైతం స్పృహ కోల్పోయాడు. బావిలోనే ముగ్గురూ చిక్కుకోవడాన్ని గమనించిన ఇంటి యజమాని నాగేశ్వరరావు కుమారుడు రంగా వారిని రక్షించేందుకు బావిలోకి దిగాడు. అతడు కూడా స్పృహ తప్పిపోయాడు. పూడిక తీత పనులకు వచ్చి గట్టుపైన ఉన్న ఎర్రయ్య కేకలు వేయడంతో స్థానికులు జాగ్రత్తలు తీసుకుని నలుగురిని పైకి తీసుకువచ్చారు.
అయితే.. అప్పటికే నలుగురు మరణించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే మంత్రి జోగి రమేష్, బందరు ఆర్డీవో ఐ.కిషోర్, డిఎస్పీ మాసుంభాషా, బంటుమిల్లి ఎస్సై పైడిబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలో మురుగు కాలువ ఉండడం వల్ల ఈ బావిలో విషవాయువులు చేరి ఉంటాయని, ఆక్సిజన్ అందక పోవడంతో మరణించి ఉంటారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.