ఘోరం.. డివైడర్‌పై నిద్రిస్తున్న వారి మీద నుంచి వెళ్లిన‌ ట్రక్కు.. నలుగురు దుర్మ‌ర‌ణం

Four killed as truck runs over people sleeping on road divider in Delhi.డివైడ‌ర్ పై నిద్రిస్తున్న వారి మీద నుంచి ట్ర‌క్కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sept 2022 9:50 AM IST
ఘోరం.. డివైడర్‌పై నిద్రిస్తున్న వారి మీద నుంచి వెళ్లిన‌ ట్రక్కు.. నలుగురు దుర్మ‌ర‌ణం

డివైడ‌ర్ పై నిద్రిస్తున్న వారి మీద నుంచి ఓ ట్ర‌క్కు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ విషాద ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలోని సీమాపురిలో జ‌రిగింది.

బుధవారం తెల్లవారుజామున 1.51 గంట‌ల స‌మ‌యంలో సీమాపురి ప్రాంతంలోని డీటీసీ డిపో వ‌ద్ద రెడ్ లైట్ సిగ్న‌ల్ ప‌డింది. అయితే.. దానిని ప‌ట్టించుకోకుండా లారీ డీఎల్‌ఎఫ్ టీ-పాయింట్ వైపు వేగంగా వెళ్లింది. అదుపు త‌ప్పి డివైడ‌ర్‌పై నిద్రిస్తున్న వారి మీద నుంచి దూసుకువెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌రలించారు.

ఆస్ప్రత్రికి త‌ర‌లిస్తుండ‌గా ఒక‌రు మృతి చెంద‌గా.. చికిత్స పొందుతూ మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల‌ను కరీం (52), ఛోటే ఖాన్ (25), షా ఆలం (38), రాహుల్ (45)గా గుర్తించారు. వీరిలో కరీం, ఛోటే ఖాన్, షా ఆలంలు న్యూ సీమాపురి ప్రాంతానికి చెందిన వారు కాగా.. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నివాసి.

డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయ‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్థారించిన‌ట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ సత్యసుందరం తెలిపారు.

Next Story