హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నుహ్ జిల్లాలోని కంగర్కా గ్రామంలో సోమవారం సాయంత్రం భారీ మట్టి దిబ్బ కూలిపోవడంతో నలుగురు బాలికలు సజీవ సమాధి అయ్యారు. అ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.. విషాదం సంభవించినప్పుడు బాలికలు తమ ఇళ్ల కోసం కొంత మట్టిని తవ్వడానికి అక్కడికి వెళ్లారు. వారిపై పెద్ద మట్టి కుప్ప కూలి నలుగురు మృతి చెందినట్లు సమాచారం. గ్రామస్తులు మృతుల మృతదేహాలను వెలికితీశారు. నలుగురు బాలికలు రక్షించేలోపే ఊపిరాడక మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఘటనకు గల కారణాలను తెలుసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. మృతులను వకీలా (19), జానిస్తా (18), తస్లీమా (10), గులాఫ్షా (9)గా పోలీసులు గుర్తించారు. మరో బాలిక సోఫియా రక్షించబడింది. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. మృతుల కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో దానిని ప్రమాదంగా అంగీకరించారు.
అందరూ తమ ఇళ్ల కోసం కొంత మట్టిని తవ్వడానికి వెళ్ళినప్పుడు పెద్ద మట్టి భాగం వారిపై పడింది. దాని కిందే వారు చిక్కుకుపోయి మృతి చెందారు. సోఫియా ఎలాగోలా బయటకు వచ్చి గట్టిగా కేకలు పెట్టింది. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురు బాలికల మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదమని, ఎవరినీ నిందించబోమని గ్రామ సర్పంచ్ ముష్త్కిమ్ అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని, గాయపడిన బాలిక పరిస్థితి నిలకడగా ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.