యూట్యూబ్‌లో చూసి..బ్యాంకుకు టోపీ
Four arrested for duping ICICI Bank of Rs 1.3 crore.యూట్యూబ్‌లోని వీడియోలు చూసి బ్యాంకుకు పంగనామం పెట్టాడు.
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2022 2:25 AM GMTయూట్యూబ్‌లోని వీడియోలు చూసి బ్యాంకుకు పంగనామం పెట్టాడు. డొల్ల కంపెనీను స్థాపించి, నకిలీ ఉద్యోగులను సృష్టించి వారి పేరు మీద డెబిట్, క్రెడిట్ కార్డులు తీసుకుని వాటి ద్వారా ఐసీఐసీఐ బ్యాంకును రూ.1.33 కోట్ల మేర మోసం చేశాడు. ఈ నగదుతో రెండు లగ్జరీ కార్లతో పాటు ఓ ఇంటిని కొనుగోలు చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ తండాకు చెందిన శ్రీకాంత్ కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అక్రమ మార్గంలో డబ్బు ఎలా సంపాదించాలని యూట్యూబ్‌లో పరిశోధించిన శ్రీకాంత్.. ఆఖరికి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి మీద రుణాల తీసుకొని బ్యాంక్‌లకు టోకరా వేయాలని నిర్ణయించుకున్నాడు. లివింగ్ ఇంటీరియల్ డిజైనర్స్ పేరిట మేడిపల్లి సత్యనారాయణపురంలో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన బానోతు సుమన్, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఎడ్ల బిక్షపతి లకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి, వారి ఆధార్, పాన్ కార్డ్‌లను సేకరించాడు. వీరిద్దరిని నకిలీ సంస్థకు యజమానులుగా చూపించాడు.
తన గ్రామానికి సమీపంలోని కొందరు యువకులు, గృహిణులకు తక్కువ వడ్డీకి రుణాలిప్పిస్తానంటూ ఆధార్‌కార్డులు సేకరించి వారు తన సంస్థలో పని చేస్తున్నారంటూ హబ్బిగూడ, ఉప్పల్, రామంతాపూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బందిని నమ్మించి శాలరీ అకౌంట్లు తెరిచాడు. క్రెడిట్ కార్డ్‌లను కూడా తీసుకున్నాడు. క్రెడిట్ కార్డ్‌ల రుణ పరిమితి అర్హతను పెంచేందుకు 34 క్రెడిట్ కార్డ్‌దారులలో ప్రతి నెలా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల జీతం వేసేవాడు. తరువాత తనే తీసుకునేవాడు. క్రెడిట్ లిమిట్ పెరగగానే రూ.1.33 కోట్లు నగదును ఉపసంహరించాడు.
క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకుండా రెండేళ్లుగా బ్యాంకులకు టోకరో వేశాడు. హబ్సిగూడ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ శ్యామ్ సుంకర జూలై 24న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌తో పాటు అతడికి సహకరించిన సుమన్, నగేష్, గౌతమ్‌లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 93 డెబిక్ కార్డ్‌లు, 3 క్రెడిట్ కార్డ్‌లు, రెండు కార్లు, 28 పాన్ కార్డ్‌లు, 54 ఆధార్ కార్డ్‌లు, 24 కంపెనీ గుర్తింపు కార్డులు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.