సోమవారం నాడు రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో రణతంబోర్ టైగర్ రిజర్వ్‌కు చెందిన ఒక ఫారెస్ట్ గార్డు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. దీంతో అతడిని గ్రామస్తులు చితకబాదారని పోలీసులు తెలిపారు. అవమానంతో 17 ఏళ్ల బాలిక బావిలోకి దూకిందని, అయితే స్వల్ప గాయాల బారిన పడ్డ ఆమెను స్థానికులు రక్షించారని వారు తెలిపారు. ముఖేష్ గుర్జార్ (41) గా గుర్తించబడిన గార్డును అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు.
రావంజన దుంగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరిమాన్ మీనా ప్రకారం.. సోమవారం బాలిక అడవిలోకి వెళ్లినప్పుడు గార్డు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని గుర్జర్‌ను పట్టుకుని కొట్టారు. ఆ బాలిక సమీపంలోని బావిలోకి దూకింది కానీ ఒక కాలుకు గాయంతో ప్రాణాలతో బయటపడిందని ఆయన చెప్పారు. అటు గుర్జర్‌ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించామని, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి జైపూర్‌కు తరలించామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా గుర్జార్‌పై అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అటవీ సిబ్బంది ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొంతమందిని పరామర్శించడానికి సవాయి మాధోపూర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన వ్యవసాయ మంత్రి డాక్టర్ కిరోడి లాల్ మీనా, సంఘటన గురించి తెలియగానే ఫారెస్ట్ గార్డు, మైనర్ బాలిక గురించి ఆరా తీశారు.