విజయవాడలోని గురునానక్ కాలనీలో ఓ పుట్‌బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గురైయ్యాడు. ఓ రౌడీషీటర్ అంత్యక్రియల్లో వివాదం కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. రెండు రోజల క్రితం వాంబే కాలనీలోని రౌడీ షీటర్ టోని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టోని అంత్యక్రియల్లో జక్కంపూడీ కాలనీకి చెందిన పుట్‌బాల్ ప్లేయర్ ఆకాశ్ పాల్గొన్నాడు. ఆకాశ్‌తో పాటు ప్రభాకర్ మరికొంత మంది టోని గ్యాంగ్‌లో పని చేస్తున్నారు. అంత్యక్రియల అనంతరం వీరంతా ఓ బార్‌లో పుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలో ప్రభాకర్, ఆకాశ్ గ్యాంగ్ ల మధ్య వివాదం చెలరేగింది. పోలీసులు వస్తారని వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంగళవారం రాత్రి ప్రభాకర్ గ్యాంగ్.. ఆకాశ్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి అతడిపై దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.