ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రహాదారులన్నీ రక్తమోడుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరులో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీని తూఫాన్ వాహనం ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాను వాహనం నంద్యాల నుంచి తిరువణ్ణామలై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పీలేరులోని ఎంజేఆర్ కళాశాల ఆగి ఉన్న లారీని తూఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదర్శన చేసుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.