ఏడుగురు కుటుంబ సభ్యుల హత్య కేసులో తొలిసారిగా మహిళకు ఉరి శిక్ష.. జైలులో ఏర్పాట్లు
first woman to be hanged in independent India. స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష పడనుంది.
By Medi Samrat Published on 18 Feb 2021 8:29 AM ISTస్వాతంత్ర్యానంతరం తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష పడనుంది. ప్రేమ పెళ్లి ఒప్పుకోలేదని కుటుంబానికి చెందిన ఏడుగురిని ఆ మహిళ దారుణంగా హత్య చేసింది. 2008లో జరిగిన ఈ దారుణ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. చివరికి ఆ మహిళకు, ప్రేమించిన వ్యక్తికి న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్ 2008లో ప్రియుడు సలీంతో కలిసి తన కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత దారుణంగా హతమార్చింది.
ఇంగ్లిష్‌లో ఎంఏ చేసిన షబ్నమ్.. టెన్త్ ఫెయిల్ అయిన సలీంను ప్రేమించింది. పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడింది. అయితే చనిపోయిన వారిలో ఆమె తల్లి, తండ్రి, సోదరులు, సోదరి కూడా ఉన్నారు. ఈ కేసులో సలీం, షబ్నమ్‌లకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. అంతేకాదు సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించడంతో చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది కూడా తిరస్కరణకు గురి కావడంతో వీరిని ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, వీరికి ఉరి వేసేందుకు తేదీ ఇంకా ఖరారు కాలేదు. నిర్భయ నిందితులను ఉరివేసిన పవన్ జల్లాద్ అనే వ్యక్తి షబ్నమ్‌నూ ఉరి తీయనున్నారు. ఉరి వేసే గదిని ఇప్పటికే పవన్ జల్లాద్ రెండు సార్లు పరిశీలించారు. షబ్నమ్‌కు ముందు మహారాష్ట్రలోని అక్కా చెల్లెళ్లు సీమా గవిట్, రేణు షిండేలకు కూడా ఉరిశిక్ష పడింది. ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో వీరు ప్రధాన నిందితులు. వీరి క్షమాభిక్షను 2014లో రాష్ట్రపతి తిరస్కరించారు. వీరికి ఇంకా ఉరి శిక్ష అమలు కాలేదు. ప్రస్తుతం వీరు యరవాడ జైలులో ఉన్నారు.