కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది రోగులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అందరు నిద్రలో ఉండటం, మంటలు వేగంగా వ్యాపించడంతో...రోగులు బయటకు వెళ్లలేకపోయారు. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 13 మంది సజీవ దహనమయ్యారు.
#UPDATE 13 people have died so far in fire at COVID hospital in Virar, in Vasai Virar municipal limits, Palghar district
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలోని మిగతా రోగులకు వెంటనే సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఈ నెల 21 న ఆక్సీజన్ ట్యాంకర్ లీకైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న దాదాపు 22 మంది రోగులకు పైగా మరణించారు. ఈ అంశం జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.