హైదారాబాద్ పాతబస్తీలోని ఓ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. అదృష్ట వశాత్తు విద్యార్థులందరూ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ గౌలిపురాలోని శ్రీనివాస హైస్కూల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్యాలయం నుంచి గురువారం మధ్యాహ్నం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నికీలలు ఎగిసిపడ్డ సమయంలో స్కూల్లో సుమారు 50 మంది దాకా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటలు చెలరేగిన అంతస్తులోని ఫర్నీచర్, రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.