అనుమానం పెనుభూతం అని ఊరికనే అనలేదు పెద్దలు. ఎవరిపైనా అయినా ఒక్కసారి అనుమానం మొదలైతే అది పోవడం చాలా కష్టం. కట్టుకున్న భార్య, సొంత కూతురు, కొడుకులను సైతం అనుమానిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. కూతురు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అనుమానం పెంచుకున్న ఓ తండ్రి ఆమెను డాబాపై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో నివసిస్తున్న ఓ విద్యార్థిని(16) ఇంటర్ చదువుతోంది. రెండు రోజుల క్రితం విద్యార్థిని ఇంట్లో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా చూసిన తండ్రి ఆమెను మందలించాడు. అయినప్పటికీ కూతురు ఫోన్ మాట్లాడడం ఆపలేదు. మరోమారు డాబాపైకి ఎక్కి ఫోన్ మాట్లాడుతోంది.
కూతురు ఖచ్చితంగా అబ్బాయితోనే మాట్లాడుతుందని అనుమానం అతడిలో మొదలైంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. డాబాపైకి ఎక్కి కూతురి గొంతు పట్టుకుని డాబా పై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. చుట్టు పక్కల వారి సాయంతో ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు బాలికను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు బాలికకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.