ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌లేద‌ని కూతురిని హ‌త్య చేసిన తండ్రి.. సెల్ఫీ వీడియో వైర‌ల్

Father kills his Daughter in Visakhapatnam.కూతురిని హ‌త్య చేసిన తండ్రి.అనంత‌రం త‌న కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 3:41 AM GMT
ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌లేద‌ని కూతురిని హ‌త్య చేసిన తండ్రి.. సెల్ఫీ వీడియో వైర‌ల్

కూతురు ప్రేమ వ్య‌వ‌హారం న‌చ్చ‌ని తండ్రి ఆమెను మంద‌లించాడు. ఎన్ని సార్లు చెప్పిన‌ప్పటికి అత‌డు చెప్పిన మాట‌ల‌ను ఆమె విన‌క‌పోవ‌డంతో హ‌త్య చేశాడు. అనంత‌రం త‌న కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో వివ‌రిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘ‌ట‌న విశాఖ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

విశాఖ కేజీహెచ్ డౌన్‌లోని రెల్లివీధిలో వ‌డ్డాది వ‌ర ప్ర‌సాద్ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇత‌డు కేజీహెచ్ మ‌హాప్ర‌స్థానం వ్యాను డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. భార్య అత‌డిని వ‌దిలివేసి వెళ్లిపోగా.. ఇద్ద‌రు కూతుళ్ల‌ను పెంచి పెద్ద చేశాడు. పెద్ద కుమార్తె ప్రేమించిన వ్య‌క్తితో వెళ్లిపోయింది. రెండో కూతురు లిఖిత‌శ్రీ(16) ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది.

అర‌వింద్ అనే యువ‌కుడిని ప్రేమిస్తున్నాన‌ని ఇటీవ‌ల లిఖిత త‌న తండ్రి వ‌ర‌ప్ర‌సాద్‌కు చెప్పింది. అత‌డితో తిర‌గ‌వ‌ద్ద‌ని వ‌ర‌ప్ర‌సాద్ కుమార్తె లిఖిత శ్రీ చెప్పాడు. తండ్రి మాట‌లు విన‌కుండా అర‌వింద్‌తో క‌లిసి ఇటీవ‌ల లిఖిత శ్రీ బ‌య‌ట‌కు వెళ్లింది. వ‌ర‌ప్రసాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. వాళ్లిద్ద‌రిని తీసుకువ‌చ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు.

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం ఈ విష‌య‌మై మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఆగ్ర‌హంతో కుమార్తెను హ‌త్య చేసి చంపేశాడు. అనంత‌రం పోలీసుల‌కు వెళ్లి లొంగిపోయిన‌ట్లు తెలిసింది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?

"నా కూతురిని నేను చంపేశాను. ఎవ‌రో అబ్బాయి కోసం ఆమెను పెంచ‌లేదు. చ‌ద‌వు కోసం, బాధ్య‌త కోసం పెంచాను. పెద్ద‌మ్మాయి ఏదో చేసింద‌ని ఆమెను వ‌దిలేశాను. చిన్న‌మ్మాయి బాక్సింగ్‌లో చేర‌తానంటే చేర్పించాను. అరవింద్‌ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అత‌ను గొడ‌వ‌ల్లో ఉన్నాడు. ఆగాల‌ని కోరాను. అయినా నా మాట విన‌లేదు. ఆమె ప్ర‌వ‌ర్త‌న నాకు న‌చ్చ‌లేదు. దీంతో నా తల్లి విజ‌య‌ల‌క్ష్మీ వ‌ర్థంతి రోజునే నా కూతురిని చంపేశాను" అని వీడియోలో వ‌ర‌ప్ర‌సాద్ చెప్పాడు.

Next Story