రోకలిబండతో కూతురిని కొట్టి చంపిన తండ్రి.. కారణం అదేనా..?
Father Kills his daughter in Anantapur District.కులాంతర ప్రేమ ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి
By తోట వంశీ కుమార్ Published on 10 Sept 2022 12:01 PM ISTఇటీవల కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తమ కంటే తక్కువ కులం వాడిని కూతురు ప్రేమించిందనో, పెళ్లి చేసుకుందనే కారణంతో అన్ని రోజులు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును, ఆమెతో పాటు అల్లుడిని హత మార్చిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కులం పిచ్చితో కన్న పేగుబంధాన్ని బలితీసుకుంటున్నారు. కులాంతర ప్రేమ ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి రోకలి బండతో కుమార్తె తలపై మోదీ హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో స్వాతి(18) తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఇంటర్ తప్పడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. స్వాతి ఇటీవల ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ విషయం ఇంట్లో తెలిసింది. ఆ అబ్బాయి ది వేరే కులం కావడంతో స్వాతి తండ్రి గుర్రప్ప వీరి ప్రేమను వ్యతిరేకించాడు. దీంతో ఈ విషయమై స్వాతి, గుర్రప్పకు మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నాం మరోసారి ఈ విషయమై వాగ్వాదం జరిగింది. అతడిని ప్రేమించడం మానేయాలని గుర్రప్ప చెప్పగా.. ఇందుకు స్వాతి నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గుర్రప్ప పక్కనే ఉన్న రోకలి బండతో స్వాతి తలపై గట్టిగా కొట్టడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.