దారుణం.. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టిన కొడుకుని చంపిన తండ్రి
తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 May 2024 5:29 AM GMTదారుణం.. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టిన కొడుకుని చంపిన తండ్రి
తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొందరు యువత ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచనతో బెట్టింగ్‌లకు వెళ్తుంటారు. ఇంకొందరు జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్‌లకు అలవాటు పడతారు. అయితే.. కొందరు మాత్రమే ఇందులో అదృష్టం కొద్ది డబ్బులు వెనకేసుకుంటారు. కానీ.. ఎక్కువ మొత్తంలో జనం మాత్రం అప్పులపాలవుతారు. మెదక్ జిల్లాలో కూడా ఓ వ్యక్తి బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆగ్రహావేశంతో కన్నకొడుకు అని చూడకుండా దారుణంగా చంపేశాడు.
మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో ఈ దారుణ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన ముకేశ్ కుమార్ (28) బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇంట్లో ఉన్న డబ్బు తీసుకెళ్లి మొత్తం బెట్టింలకు పెట్టేసేవాడు. తరచూ కొడుకు వ్యవహారాన్ని తప్పుబడుతున్న తండ్రి సత్యనారాయణ తీరు మార్చుకోవాలని.. బెట్టింగ్ జల్సాలు మానుకోవాలని హెచ్చరిస్తూ వస్తున్నాడు. కానీ కొడుకు మాత్రం తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు. అస్సలు పట్టించుకోలేదు. దాదాపుగా ముకేశ్ బెట్టింగ్‌లు పెడుతూ ఏకంగా రూ.2 కోట్ల వరకు పొగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పిన మారకపోకవడంతో శనివారం ఇదే విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్త పెద్దది కావడంతో తండ్రి సత్యనారాయణ కొడుకుపై దాడి చేశాడు.
ఇనుపరాడ్డుతో ముకేశ్‌పై తండ్రి సత్యనారాయణ బలంగా కొట్టాడు. దాంతో తీవ్ర రక్తస్రావమైన యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ముకేశ్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా.. మేడ్చల్‌లో ఉన్న ఇల్లు, ప్లాట్‌ను బెట్టింగ్ కోసం పెట్టి అమ్మేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ముకేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.