ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి గర్భవతి అని కుటుంబ సభ్యులు గుర్తించడంతో, వారు ఆమెను అడవిలోకి తీసుకెళ్లి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. మహిళ ప్రాణాలతో బయటపడింది, కానీ పరిస్థితి విషమంగా ఉంది.
హాపూర్‌లో 23 ఏళ్ల అవివాహిత మహిళ గర్భవతి అని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు నిప్పంటించారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన నవాడ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. శరీరంపై 70 శాతానికి పైగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు. మహిళ తల్లి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ అదే గ్రామానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుని గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 28, గురువారం మహిళ తల్లి, సోదరుడు ఆమెను సమీపంలోని అడవికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి, సోదరుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.